14, ఏప్రిల్ 2018, శనివారం

పల్లె ఒక పురాతన జ్ఞాపకం?!?
**************************
అనగనగా ఊరుండేది...
ఇప్పుడిలాగే అనాల్సొస్తుందేమో!
పల్లెవెలుగులు
పట్నపు రహదారులప్రక్క
గుడిసె దీపాలై పడుండంచూస్తుంటే
పల్లె ఆనవాలు గూగూల్ పటం
గుర్తు పట్టలేదంటే...
ఇప్పుడనాలనిపిస్తుంది
అనగనగా...ఒక పల్లె
ఉండేదని.....

సిమ్మెంటు కట్టలక్రింద
చిదుగుతున్న ఎముకలు
పునాది రాళ్ళ క్రింద సమాధులైన
బతుకులు...
అన్నం పెట్టాల్సన చేతులు
సున్నం కలుపుతుంటే...
పదారణాల జానపదం
రైలు పట్టాలకింద పడి....తునకలైతపోతుంటే..
అనగనగా....ఒక వాడ ఉండేదని
ఇప్పు డనాల్సి...వస్తుంది ...

దుబాయ్ కొరడా ఝుళిపింపులు
అమెరికా వీసా జడిపింపులు
చెన్నై...శ్రమదోపిడీ దారుణాలు
మట్టిని తలకెత్తుకున్నవాడు
మట్టిలో కూరుకుపోతే...
పైరుగాలిలాంటివాడు
పొగగొట్టమైపోతే....
అనగనగా ఒక గూడేం
ఒకప్పుడుండేదనాల్స వస్తుంది!

పట్నంలో...పనినేరుకుంటున్న
అన్న దాతను..చూసినప్పుడు
అనగనగా...ఒక పాడు ఉండేదట
అనాల్సొస్తుందిపుడు....
మృగ్యమౌతున్న పల్లె
మృగతృష్ణ లాంటి...వలస బతుకు
అన్న రాశులమాగాణి
ఆకాశ హార్మ్యంగా....మారుతుంటే
అభివృద్ధిలో ఉన్నమో
అధః పాతాళంలో ఉన్నామో....తెలీదుకానీ
పల్లె మాత్రం....ఒక భూతకాల జ్ఞాపకం!
***********************************
-------------కిలపర్తి దాలినాయుడు
************************************



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి