17, ఏప్రిల్ 2016, ఆదివారం

తడి - రచన చెళ్ళపిళ్ళ శ్యామల



తడి
రచన: చెళ్ళపిళ్ళ శ్యామల
మొబైల్: 9949831146
ఎక్కడో – ఉండనే ఉంటుందది.
ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతుంది!
చరిత్ర పుటల్లో
మూసుకుపోయినా
తెరిచిన తాళం చెవిలా
ఎక్కడో చోట
తెరుచుకుంటుంది.
ఆనందాల రెక్కలు తొడిగి
వరికుచ్చుకై పిచ్చుకెగిరినట్టు
గాలిపటమై ఎగరాల్సిన బాల్యం
రెక్కలు తిరిగి
కార్పోరేట్ చదువుల పంజరంలో
బంధీగా మారినాసరీ,
ఆశల రంగవల్లులతో
మమతల గొబ్బిళ్ళతో
ముంగిట నందనం
మొలిపించేందుకు
పిడికెడు మట్టి ముంగిట
లేకపోయినా సరే,
      చలోక్తులు సామెతలు
      జాతీయాలు నుడికారాలు
      నింపుకుని –
      చమత్కారాల సుడులతో
సెలయేటిల సాగిన భాష
పడగెత్తిన పాశ్చ్యాత్య సునామి దాడికి
నెల పొదల్లో ఇంకినా సరే,
కులాసా కోడిపందేలతో
హుహుషారెక్కిన కుర్రకారు
నిషా మత్తులో జోగుతున్నా సరే,
నిహారిక తెరల మాటున సాగిన
హరిదాసుల గానాలు
సినీ శబ్ద తరంగాల  హోరులో
మునిగిపోయినా సరే,
          డూ డూ బసవన్నా అంటూ ఆడిస్తే
          కనువిందు చేసే గంగిరెడ్లు
          దూడగా పుట్టిల పాపానికి
          తల్లి పాలే కరువై
          అర్దాయుష్కులై పోతున్నా సరే,
ఉమ్మడి కుటుంబాలు
మట్టి కుండలై విడిపోతున్నా సరే,
ఎక్కడో ఉంటుందది.
మనసు మైదానం పై,
మమతల జల్లు కురిసినప్పుడో
ఆర్ధిక సంబంధాలు –
పాములై బుసలు కొట్టినప్పుడో
ఎక్కడో చోట
మనసుకి మట్టి తగిలితే చాలు –
జారిన జ్ఞాపకాలన్నీ
తడి తడి గా కదిలి
తేనె తీగలై మదిని
చుట్టేస్తాయి.
******





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి