8, ఏప్రిల్ 2018, ఆదివారం

దృష్టి బొమ్మ

దృష్టి బొమ్మ! -చిత్తలూరి


గాలి నిండా
మూఢ నమ్మకపు
తెరలు లేచాక
రంగు రంగుల బొమ్మలకు
బట్టలు చెదిరిపోతాయి
పంట చేను ముందు
దిష్టి బొమ్మలై
వాలిపోతాయి
మగాళ్ల నర దిష్టికి
ఆమె మంత్రమేస్తుంది సరే
ఆడవాళ్ల నర దిష్టికి
ఏ మగ బొమ్మను
పెడతాడో
అతన్నే అడిగి చూడాలి
విరగ కాసిన
పంట చేనులాంటి ఆమెను
ఇలా వాడుకోవాలని
అతనికెలా తెలిసిందో కానీ
ఎప్పుడూ
ఆమెలే గాయపడుతున్నారని
మాత్రం
అతనికి తెలిసే
అవకాశం లేదు
మగవాడి గడ్డం చేసుకునే
బ్లేడు దగ్గర కూడా
అమే అందమే
కత్తిగాటులా
తెగిపడుతున్న చోట
ఇప్పుడు కొత్తగా
పంట చేను ముందు
దిష్టి బొమ్మలా నిలబెట్టటం
ఏ నమ్మకమని మాత్రం
అతనికేం తెలుస్తుంది
ఇలాంటి మూఢనమ్మకాలను
చూస్తూ మనమంతా
దిష్టి బొమ్మలుగా
నిలబడినంత కాలం
ఈ సమాజం పట్ల
మనలోని దృష్టి బొమ్మ
మారనంత కాలం
తెరమీది బొమ్మలయినా
గుండె తెరమీది అమ్మలయినా
పంట చేలో గడ్డిబొమ్మల పక్కనో
కొత్త నిర్మాణాల ముందు
కోరలున్న రాక్షసుడి
వికృత రూపాల చెంతనో
అర్థనగ్న అందాల భామల
రూపంలో
దిష్టి బొమ్మలుగా చేరిపోతారు
నా చెమట చుక్కల శ్రమైక మూర్తులు
సిగ్గుతో తలవొంచుకుని
ఫ్లెక్సీ ముందునుంచి
మౌనంగా తరలిపోతారు!

      - చిత్తలూరి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి