రచన : మొయిద శ్రీనివాసరావు
పొద్దున్నే
ఆకాశం భగ్గున అంటుకున్నట్టుంది
జ్వరం తగిలిన పిల్లాడి ఒళ్ళులా
నేల కాలిపోతుంది.
గాలితో ఘర్షణ పడ్డాయేమో
ఆకులు అలకపాన్పేశాయి
వేకువనే కొక్కొరొకో అంటూ
కేకలేసిన పాపానికి
పంచనున్న కోడిపుంజుపై
కన్నెరజేస్తుంది ఎండ
పోట్లాటలో ఓడిన పిల్లాడు
చేసిన సవాలుకు మల్లే
చెట్టు నీడన బస్కీలు కొడుతూ
ఎండను ఎగతాళి చేస్తుంది తొండ
ఇళ్లల్లో అందరూ నీటిని పీల్చి
నిప్పులు కక్కే సమయం
రోడ్డు పక్కన నడుంలోతు గోతిలో
పిడికెడు బువ్వ కోసం
తట్టెడు మట్టిని తవ్వి
నాలుగు చేతులు నెత్తిన పోసుకుంటున్నాయి
చచ్చిన చెరువులోని నీటిచుక్కలు
ఈ మట్టిదేహాలపై చెమటపూలై
విచ్చుకుంటున్నాయి
ఆకలి పేగు అరుపు వినలేకో
కాలే కడుపులను కనలేకో
ఆకాశపుటడవిలో పులిలా కలతిరిగినదల్లా
పిల్లిలా మబ్బుల మాటున మొహం చాటేసింది
సాయంకాలానికి చిల్లర వర్షం కురిసి
చీకటి మొహంలో
ఓ చంద్రవంక తళుక్కున మెరిసింది
**********************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి