రచన: డా.జి.శిరీష. Ph.D
ఇంకా ... సంసారంలో నిషిద్ధాక్షరినని
పరుగులెత్తే సెలయేటి ఒడ్డున
చతికిలబడతావా?
నిన్నటివాళ్లు అసహాయులే
వంటింటి కుందేళ్ళే
వాళ్ళ చుట్టూ సంప్రదాయ వక్రభాష్యాల
సంకెళ్ళే
ఆలోచనలు మొలకెత్తనీయని బీళ్ళే
వాళ్ళూ కట్టుబాట్ల కత్తిమీద సాము
చేస్తూ
గుండెపాడే రాగాన్ని బంధించినవారే
కర్మసిద్ధాంతం సాలెగూట్లో
గిరికీలు కొడుతూ తప్పటడుగులనాడే
రాజీపడడం నేర్చుకున్నవారే
విజ్ఞానాన్ని అవపోసన పట్టినా
విధిరాతంటూ వేదాంతం వల్లించినవారే
కనపడని ముసురెప్పుడూ మనసులో
కురుస్తున్నా
కళ్ళమీద చిరునవ్వుల ఇంద్రచాపాన్ని
సృష్టించినవారే
కలల్నితిని కన్నీళ్లని
మిగుల్చుకున్నవారే
ఆంక్షల తుమ్మముళ్ళ మధ్య తీరని కాంక్షలే
... సంసారంలో నిషిద్ధాక్షరులే
వాళ్లకు వారసురాలివే కాని...
నీలో స్వావలంబన, స్వరక్షణ శక్తులున్నాయని మరువకు
సౌందర్య తిలకవు మాత్రమే కాదు సాహస
నెలతవని మరువకు
గతం గాయాలను చూసి చతికిలబడకు
ఉరికొయ్యను కౌగిట చేర్చకు
శిశిరానికి చోటియ్యకు
లోచూపు ఆవిష్కరించు, నిటారుగా నిలబడు
వర్తమాన నాయికవై భవిష్యత్
సిద్ధాక్షరివై
కన్నీటికి అడ్డుకట్ట వెయ్యి, నవచైతన్యం పుట్టించు.
***********************
mee kavitha chala bagundi spoorthi dayakam gaa undi
రిప్లయితొలగించండిsireesha garu mee kavitha chala baagundi
రిప్లయితొలగించండి