5, నవంబర్ 2012, సోమవారం

రేపటి దృశ్యాలు / దృశ్య పరంపర



రచన: కె.రామారావు

వాన వెలసిన వేళ
గాలి దుర్వార్తను మోసుకొచ్చింది
మొలకెత్తాల్సిన విత్తు
నేలలోనే నిక్షిప్తమవుతానని
తీర్మానించుకున్నదని..
కిరణాలు సోకే వేళకు
పూవు తల వాల్చుకొని రోదిస్తున్నది
పురిటివేళకు బిడ్డ
గర్భం దాటి రానని గోల చేస్తున్న దృశ్యాన్ని చూసి
వెలుతురులో స్వేచ్చను కోల్పోయిన పక్షి
చీకట్లో గుడ్లగూబతో ఒప్పందం
నీటిలో బతుకు బరోషాలేక చేప
ఒడ్డుపై భ్రమలు పెంచుకుంటుంటే
వలస పక్షులు పిచ్చుక మిత్రుని కోసం
వెదికి వెదికి తిరుగు ప్రయాణంలో దారి తప్పాయి
అయినా నేను వర్షాకాలం వస్తే
యూరియా యుద్ధాలు చెయవలసిందే మరి!
తల తెగిన చెట్టు
భూమికి భారమయ్యానని కృంగిపోతుంటే
కొండ గుండెలోతుల్లో బద్ధలై
అరణ్యంలో అంతరించి
నగరంలో అపార్ట్‌మెంటుగా చిగురిస్తుంది/అవతరిస్తుంది
బతుకు వేటలో మనిషి
ఆనవాలు మరిచి
ఖండాంతరాలలోనో ఖగోళాంతరాలలోనో
తన రూపాన్ని తానే వెదుక్కుంటుంటే
జ్ఞాపకాల వేటలో మృగాలు
ఆనవాలు వెతుక్కుంటూ
అరణ్యం నుండి జనారణ్యంలోకి
ఖచ్చితమైన ఆధారాలతో
ఆవాసాల్లోకి చొరబడుతూ
నివాసితుల్ని భయపెడుతూ..


                                                                            *************************

1 కామెంట్‌: