15, నవంబర్ 2012, గురువారం

శరత్సంచిక - నవంబర్ 2012

మనసులో మాట



రచన : బసు పోతన                                  

మనిషి మరో మనిషి కోసం బ్రతకడం వేరు. తనకోసమే తను బ్రతకడం వేరు. మారుతున్న జీవన పరిస్థితుల నేపధ్యంలో పరాయీకరణ పాఠాన్ని వల్లె వేసుకుంటూ తన కోసమే తను బ్రతికే ప్రాధాన్యంలో మనిషి నుండి మనిషి దూరమై పోతున్నాడు. మరణం కూడా మెటీరియలిస్టిక్‌గా, మనసులు యంత్రాలుగా పని చేస్తున్న ఈ సందర్భంలో "ఆనందమంటే డబ్బు, ఎదగడమంటే  బంధాలనుండి విడిపోవడమే" అన్న ధోరణి పాతుకుపోయింది.

పిల్లలు ఎదుగుతున్న సందర్భంలో తల్లితండ్రులు, బంధువులు నేర్పుతున్న పాఠాలు బాగా సంపాదించడమే (జీతమే) జీవితం, పెద్ద స్థాయిలోకి వెళ్లడమే.. మరీ ముఖ్యంగా నీ బంధువులలో అందరికన్నా పైన ఉండడమే విజయం అని నేర్పడం వల్ల ఎదిగిన తర్వాత అవి అందుకునే క్రమంలోనే పరిగెడుతున్నారు. ఆ పరుగులో అసలైన ఆనందాన్ని తమ ఇష్టాల్ని కోల్పోతున్నారు. ఈ రోజుల్లో డబ్బు సంపాదనతో పాటు తమకు ఇష్టమైన వ్యాసంగంలో గడిపేవాళ్లు ఎంతమంది?

ప్రతీ మనిషిలోనూ ఒక కళ  ఉంటుంది. ఆ కళని మనలో మనం బ్రతికించినప్పుడు. అది మనల్ని బ్రతికిస్తుంది. ఆనందింప చేస్తుంది. తమలోని కళకు జీవాన్ని పోస్తూ, తమ జీవితాన్ని ఆనందిస్తున్న ఎంతోమంది కళాపిపాసులు, సాహితీ ప్రియులు ఉన్నారు. వారిని ఓ చోట చేర్చి మరికొంత మందిని ఆనందింప చేయటమే మా ఈ పత్రికా  ప్రయత్నం.   యువస్పందన  వెనకాల 33 సంవత్సరాల హృదయ స్పందన ఉంది. 8వ తేది ఏప్రిల్, 1978 సంవత్సరంలో శ్రీ  రామసూరి మాస్టారు స్థాపించిన  ఈ సంస్థ విజయనగరం సిగలో ఒక సాహితి కుసుమమై వికసించింది.

125 వ గురజాడ జయంతి సందర్భంగా శ్రీ శివారెడ్డి అధ్యక్షతన అఖిలాంధ్ర కవి సమ్మేళనం అలాగే అంత్యాకుల రాజేశ్వర రావు చిత్ర కళా  ప్రదర్శన, ఆకుంది సాయి రామ్ కార్టూన్ చిత్ర కళా ప్రదర్శన, ఆకాశవాణి జాతీయ యువ సంగీత కళాకారులు ఇంద్రగంటి సరస్వతి, భల్లమూడి సరళ ల శాస్త్రీయ సంగీత కచేరి వంటి కార్యక్రమాలు నిర్వహించింది.

శ్రీ చాసో, డాక్టర్ సి నారాయణ రెడ్డి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఆరుద్ర  వంటి ఉద్దండులతో యువస్పందన సాహిత్య సమావేశాలు నిర్వహించింది.  వేల్చేరు నారాయణ రావు (USA), డాక్టర్ గూటాల కృష్ణ మూర్తి (London), వాకాటి పాండురంగారావు, కుందుర్తి, శ్రీపతి, వాడ్రేవు చిన వీరభద్రుడు, శీల వీర్రాజు, రోణంకి అప్పలస్వామి,  డాక్టర్ U A నరసింహ మూర్తి, డాక్టర్ చాగంటి తులసి వంటి సాహితి వేత్తలు తమ ప్రసంగాలతో యువతలో ఓ ఊపు, కొత్త చూపు అందించారు. ఈ కార్యక్రమాలన్నిటికీ యువస్పందన వేదికగా నిలిచింది. ఉన్నవ లక్ష్మీ నారాయణ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చలం, స్థానం నరసింహ రావు, వంటి రచయితల / కళాకారుల శతజయంతి ఉత్సవాలకి వేదికైంది.

ప్రతినెల జరిగే కార్యక్రమాలలో భాగంగా యువకవులు 30 పుస్తకాలు సమీక్షించారు. ఈ కార్యక్రమాలు గురజాడ గృహంలో నిర్వహించి సాహితి సౌరభాలను మరింత పంచింది యువస్పందన. ఆ సాహితి పిపాసను, ఆ ఆకాంక్షల సౌరభాలను మారుతున్న కాలంతో మరింత మందికి అందించాలని సరికొత్త సాంకేతిక మాద్యమాలను అలవర్చుకుని ప్రయాణాన్ని ప్రారంభించింది యువస్పందన. ఈ ప్రయత్నంలో నాకు వెన్నుదన్నుగా ఉన్న మా గురువుగారు రామసూరి " మాస్టారుగారికి ఎంతో ఋణపడి ఉన్నాను. అలాగే శ్రీ మురళీధర్ రావుగారికి, శ్రీమతి జ్యోతి వలబోజు గారికి కూడా కృతజ్ఞతలు.  తమ రచనలను ఇచ్చిన కవులకి , రచయితలకి మనఃపూర్వక ధన్యవాదములు. యువస్పందన ఉరకలు వేసే యువరక్తానికి ప్రాధాన్యత  యిస్తూ, అనుభవంగల పెద్ద తరానికి పెద్ద పీట వేస్తూ సాహిత్యం, సాంస్కృతిక విలువల తెలుగు ప్రత్రికగా నిలబెట్టాలని మా ఆకాంక్ష.   ఈ ప్రయత్నంలో నా వెన్ను దన్నుగా ఉన్న మా గురువుగారు శ్రీ రామసూరి మాస్టారికి నేను ఎంతో ఋణపడి ఉంటాను.

ఈ పత్రిక సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ, మనిషిలోని ఆనందాల అంతరంగాల్ని వెలికి తీయాలనే ఆశయంతో ప్రతీ మూడు  నెలలకు ఒకసారి వెలువరిస్తామని తెలియచేస్తున్నాను. మా ఈ ప్రయత్నంలో పాల్గొన్న, పాల్గొంటున్న వారందరికీ నమస్కారములతో

సంపాదకీయం



సమకాలీన ప్రాపంచిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ మానవ సమస్యల్ని విశ్లేషించి, కళాత్మక సాహిత్య రూపాలని అందించే కవులూ, రచయితలూ ఈనాడు చాలా అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని ప్రజల జీవన పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. వ్యవసాయం, విద్య,  వైద్యం వంటి ప్రాధమిక విషయాలపట్ల నిర్లిప్త ధోరణిలో వ్యవహరిస్తున్న సందర్భమిది. ప్రపంచంలో ఏ మూల, ఏ మానవుడు కన్నీరు కార్చినా స్పందించి కళాత్మక వ్యక్తీకరణతో ప్రశ్నించాల్సిన బాధ్యత సాహిత్య సృజనకారులపై ఉంది.

మానవ వనరులైన నదులూ, చెట్లూ, వ్యవసాయ భూములూ, గాలీ, నీరు  అన్నీ వ్యాపార వస్తువులుగా మారి, వస్తు సంస్కృతి, ఆయుధ సంస్కృతి, అగ్రరాజ్యాల  ధనదాహానికి ప్రాతిపదికలైనాయి. వస్తువ్యామోహం, నిర్లిప్తత, ఆర్ధిక స్థితిగతులు, జాతి, కుల, మత, ప్రాంతీయ భేదభావాలు అభివృద్ధి చెందుతున్న దేశప్రజల జీవన విధానంలో ఆందోళన కలిగించే అంశాలుగా ప్రవేశించాయి. వ్యవసాయ కూలీల జీవనం మరీ దుర్భరంగా ఉంది. శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు. ప్రపంచమొక కుగ్రామమవుతుంది. జీవితమొక సంగ్రామమవుతుంది' అని.

శ్రీశ్రీ కవిత్వంలోని ప్రచారగుణం కళాత్మకమై యువతరం హృదయాలని స్పందింప చేసింది. ఈనాటి కవులు తమ భావాలని ఎంత ప్రతిభావంతంగా చెప్పగలిగినప్పటికీ యువ హృదయాలని ఆకర్షించలేకపోవటానికి కారణాలని మనం విశ్లేషించుకోవాలి. కళాశాలల్లో కళా సాంస్కృతిక ప్రయత్నం లేకపోవడంతో చైతన్యాన్ని కోల్పోతున్నాయి. 
యువకాశలనవపేశల సుమగీతావరణం  కనుమరుగవుతోంది. సారవంతమైన భూములు స్వార్ధపరుల రాజకీయాలకి నిస్తేజమైపోతున్నాయి. చెట్టూ చేమా, కొండాకోనా, పక్షులూ, నదులూ చివరకి సముద్రాలూ ప్రకృతిలో సమతౌల్యాన్ని దెబ్బ తీసే మానవ స్వార్ధానికి బలవుతున్నాయి. మానవత లేని లోకాన్ని స్తుతింలేను. మానవునిగా శిరసెత్తుకుని తిరగలేను ' అన్న తిలక్ వాక్యాలు గుండెలని కదిలిస్తున్నాయి.  శ్రీశ్రీ కవిత్వంలో ప్రపంచ మానవ హృదయ స్పందన అక్షర రూపమై, మహా ప్రస్థానమై తెలుగు కళా సాంస్కృతిక రంగంలో కదలిక తెచ్చింది.

ప్రసార మాధ్యమాలు, పత్రికలూ తక్షణ సంస్కృతి (Instant Culture) వ్యామోహంలో పడి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని కొత్త తరానికి హృదయాన్ని తాకేలా అందించలేకపోతోంది. జాతీయ ఉద్యమం, భూదానోద్యమం,  రైతు ఉద్యమాలూ, భూమి సమస్యలకు సంబంధించిన నిబద్ధత కలిగిన ఉద్యమాలు నిస్తేజమై స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఉద్యమాలు కొత్త తరహాలో బయలుదేరినాయి.

భారతదేశంలోని భూమి పరిమళాన్ని, అంతఃసౌందర్యాన్ని , తరతరాల వ్యవసాయ సంస్కృతి తెలిసినవారు పౌష్టికాహారం లభించని  కోట్లాది వ్యవసాయ కూలీలే వారి జీవనస్థితిగతులని మెరుగుపరిచే సాహిత్యాన్ని సృష్టించాలి. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన కవులూ, రచయితలూ వారి వారి జీవన నేపథ్యాలలోంచి చక్కని నుడికారంతో, మాండలికంతో, సామెతలూ, సంస్కృతి అన్నింటినీ వ్యక్తం చేస్తున్న రచనలు రావడం తెలుగు సాహిత్యంలో  గమనించదగ్గ పరిణామం. సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించే మంచి విమర్శకులు లేకపోవడం లోఫంగానే భావించాలి. కవులూ, రచయితలూ విశాల భావ సంస్కృతి ప్రతిబింబించే రచనలు చేసినప్పుడే మన సాహిత్యానికి గుర్తింపు వస్తుంది..

మన నేలలోంచి, మన నదుల తీరాలలో వికసించిన మానవ సాంస్కృతిక నేపధ్యంలోంచి సమగ్ర మానవ జీవితంలోని భిన్న అంశాలని స్పృశిస్తూ, సమకాలిక సంక్షోభానికి కారణాలని అన్వేషించే తాత్విక స్థాయిని పెంపొందించుకుంటూ ఉజ్వలమైన జీవితాన్ని కాంక్షించే పద్ధతిలో రచనలు చేస్తే తెలుగు సాహిత్యం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంది.

'యువస్పందన'  పత్రిక దీపావళి సందర్భంగా శరత్సంచికగా  మీ చేతుల్లో ఉంటుంది. యుద్ధాలకి అనువైన ఋతువు శరదృతువు. మానవుడు తన మెదడుకీ, హృదయానికీ జరుగుతున్న యుద్ధంలో హృదయం గెలిచేలా చేసుకోవాలి. అప్పుడే మంచి గంధంలా పరిమళించి, మానవత్వం సాహిత్యాన్ని రసవంతం చేస్తుంది. అలాంటి సాహిత్యానికి మా ఆహ్వానం..

5, నవంబర్ 2012, సోమవారం

చెమట పూలు





రచన : మొయిద శ్రీనివాసరావు

పొద్దున్నే
ఆకాశం భగ్గున అంటుకున్నట్టుంది
జ్వరం తగిలిన పిల్లాడి ఒళ్ళులా
నేల కాలిపోతుంది.
గాలితో ఘర్షణ పడ్డాయేమో
ఆకులు అలకపాన్పేశాయి
వేకువనే కొక్కొరొకో అంటూ
కేకలేసిన పాపానికి
పంచనున్న కోడిపుంజుపై
కన్నెరజేస్తుంది ఎండ
పోట్లాటలో ఓడిన పిల్లాడు
చేసిన సవాలుకు మల్లే
చెట్టు నీడన బస్కీలు కొడుతూ
ఎండను ఎగతాళి చేస్తుంది తొండ
ఇళ్లల్లో అందరూ నీటిని పీల్చి
నిప్పులు కక్కే సమయం
రోడ్డు  పక్కన నడుంలోతు గోతిలో
పిడికెడు బువ్వ కోసం
తట్టెడు మట్టిని తవ్వి
నాలుగు చేతులు నెత్తిన పోసుకుంటున్నాయి
చచ్చిన చెరువులోని నీటిచుక్కలు
ఈ మట్టిదేహాలపై చెమటపూలై విచ్చుకుంటున్నాయి
ఆకలి పేగు అరుపు వినలేకో
కాలే కడుపులను కనలేకో
ఆకాశపుటడవిలో పులిలా కలతిరిగినదల్లా
పిల్లిలా మబ్బుల మాటున మొహం చాటేసింది
సాయంకాలానికి చిల్లర వర్షం కురిసి
చీకటి మొహంలో
ఓ చంద్రవంక తళుక్కున మెరిసింది

                                                                         **********************

ఇందరెందుకు?





రచన: సి. వెంకటరావు

హాస్పిటల్ ఆవరణలోకి అడుగుపెట్టగానే మందుల వాసన ఒక్కసారిగా గుప్పుమని తగిలింది. తాతయ్య చెయ్యి పట్టుకొని ఔట్ పేషంట్స్ హాలులోనికి అడుగు పెట్టాను. వరుసగా వేసి ఉన్న కుర్చీలలో ఒక ప్రక్కగా కూర్చోబెట్టాను. ప్రక్కనే నేనూ కూర్చున్నాను.
నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులో ఏదో భయం ఉంది. ఆ భయం తాతయ్య చేతి నుండి నా మనసుకి సంకేతం పంపింది.
నిన్న రాత్రి హటాత్తుగా ఒక్కసారిగా కడుపులో నొప్పి మొదలయ్యింది. తీవ్రమైన నొప్పితో చాలాసేపు మెలికలతో తిరిగిపోయాడు. ఆ రాత్రప్పుడు ఏం చెయ్యాలో తోచక, ఆ వీధిలో ఉన్న చిన్న డాక్టరుగారిని తీసుకువచ్చాం. అతను తాత్కాలిక ఉపశమనానికి ఏవో మందులు ఇచ్చి ఉదయాన్నే పెద్ద డాక్టరుగారికి చూపించమని సలహా ఇచ్చాడు
అతని సలహా మేరకు తాతయ్యను తీసుకొని వచ్చాను.
ముందుగా టోకన్ తీసుకొని ఉండడం వలన డాక్టర్ గారి చాంబర్ లోనికి వెళ్ళాను. కొన్ని టెస్టులు చేయించమని చెప్పారు.
టెస్టుల రిపోర్టుల అనంతరం ఆపరేషన్ చెయ్యాలనీ, అది వీలయినంత త్వరగా చేయించుకోమని అన్నారు. ఆ విషయం తాతయ్యతో నేను చెప్పలేదు. ఆపరేషన్ అంటే తాతయ్యకు చాలా భయం. మానసికంగా కొంత ప్రిపేర్ చేసి చెప్పాలని నా ఉద్ధేశ్యం.
ఇంటికి వచ్చిన తర్వాత కావ్యక్కతో చెప్పాను ఆపరేషన్ గురించి. "ఆపరేషనే !! టాబ్లెట్లకే చిన్నపిల్లాడిలా అల్లరి పెట్టేస్తాడు. అలాంటిది ఆపరేషన్ అంటే ఒప్పుకుంటాడో లేదో" అంది అక్క. "నిజమేలే! మరేం చేస్తాం. మరో దారి లేదు. అలా అని మానేస్తే ప్రాణానికే ముప్పు" అని అన్నాను.
అప్పటినుండి తాతయ్యకు ఆపరేషన్ గురించి ధైర్యం చెబుతూనే ఉన్నాం. "తెలిసినవాళ్లకీ, వీధిలో వాళ్లకీ ఎవరెవరో చేయించుకున్నారని ఇప్పుడు బాగుందనీ, ఇది చాలా చిన్న ఆపరేషన్ అనీ, ఈ రోజుల్లో చాలా సులువు అయిపోయాయనీ, ఇలా చాలా రకాలుగా నచ్చజెప్పాం. చివరికి ఆపరేషన్ చేయించుకోకపోతే ప్రాణానికే ప్రమాదం" అని చెప్పాం.
ఆ చివరి మాటలు బాగా పని చేసాయి. ఎలాగో ఒప్పుకున్నాడు గాని అతని కళ్లలో ఏదో భయం. పెద్ద వయసు కదా! ఆ భయాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విధంగా తాతయ్యను చూస్తే జాలేసింది.
పిన్నీ, బాబాయ్ ఈ ఊళ్లోనే ఉన్నారు. వాళ్లకు తాతయ్య ఆపరేషన్ గురించి చెప్పాను. నాన్నకు ఫోన్ చేసి కావలసిన డబ్బులు పంపించమని చెప్పాను. ఇంకా చేయించవలసిన టెస్టులన్నీ చేయించేసి రెండు రోజుల్లో ఆపరేషన్ డేట్ తీసుకున్నాను. ఆపరేషన్ డేట్ రానే వచ్చింది.
తెల్లవారు జామున అయిదు గంటలకే పేషంటును తీసుకొని వచ్చేయమని చెప్పారు. టెస్ట్ రిపోర్టులన్నీ పట్టుకుని అక్కా, నేనూ, తాతయ్య ఒకే ఆటోలో హాస్పిటల్ చేరుకున్నాం. అదే ఊరిలో ఉన్న పిన్నీ, బాబాయ్ కూడా ఉదయాన్నే వచ్చారు.
పెద్ద హాస్పిటల్, ఆపరేషన్స్ అయ్యే బ్లాక్ వేరే ఉంది. తిన్నగా ఆటో అక్కడికే పోనిచ్చాం. ముందు పెద్ద హాలు, హాలుకి ఒకవైపు పేషెంట్స్ ఉన్నారు. ముందురోజే ఆపరేషన్ అయినవాళ్లు, ఇవాళో, రేపో డిస్చార్జి అవబోతున్నవాళ్లు,  పేషేంట్స్‌తో వచ్చిన బంధువులూ, స్నేహితులూ, రకరకాల మనుషులతో హాలంతా నిండి ఉంది.
హాలులోనికి అడుగుపెట్టగానే మందుల వాసన ముక్కుకు తగిలింది. "అబ్బా! ఇక్కడ పనిచేసే నర్సులూ, బాయ్‌లూ ఎలా ఉంటారో? అలవాటు అయిపోతుంది. నేను కూడా ఇక్కడే మూడు నాలుగు రోజులుండాల్సి వస్తుంది. ఎలాగో భరించక తప్పదు. అయినా స్పెషల్ రూం తీసుకోవాలి " అని మనసులోనే అనుకున్నాను.
తాతయ్య చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తున్నాను. చేతిని విడిపించుకునే ప్రయత్నం ఏమీ చేయడం లేదు.
హాస్పిటల్ బాయ్ వచ్చి పేషెంట్ వివరాలు అడిగాడు. మాకు కేటాయించిన రూము చూపించాడు. లోనికి వాళ్ల రూము తలుపు తీయగానే ఏ.సి. చల్లగా తగిలింది. బయట ఉన్న మందుల వాసన లేదు. ఫరవాలేదు ఉండవచ్చు అని మనసులో  నాకు నేను సమాధానం చెప్పుకున్నాను. తెచ్చిన దుప్పట్లు, తలగడ ప్రక్కన పెట్టాము. మేము తెచిన బెడ్ షీట్ పరిచి తాతయ్యను కూర్చోమంది కావ్యక్క.
తాతయ్య కూర్చున్నాడు కానీ చాలా అసహనంగా ఉన్నాడు. ఏదో తెలియని భయం అస్పష్టంగా తెలుస్తుంది. తాతయ్య ముఖాన్ని చూసి కాస్త గట్టి స్వరంలో నేను అన్నాను."హాల్లో చూడు! అందరూ నీకన్నా చిన్న వయస్సు వాళ్లే" అన్నాను.  నా మాటలకి మరి సమాధానం చెప్పకుండా మౌనంగా తలవంచుకున్నాడు. ఒక రకంగా జాలేసింది
మెడికల్ టెస్టులన్నీ ముందు రోజే చేశాం కాబట్టి, ఆ రిపోర్టులన్నీ బాయ్‌కి ఇచ్చాను. ఆ ఫైల్ తీసుకొని డాక్టర్‌గారి టేబుల్‌పై ఉంచాడు. అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. డాక్టరుగారు వచ్చిన వెంటనే ఆయన చాంబర్ లోనికి వెళ్లాను.
"ఈ వయసులో కూడా అన్నీ నార్మల్ గా ఉన్నాయంటే ఆరోగ్యకరమైన శరీరం. ఒక్క బి.పి మాత్రమే కొంచం ఎక్కువగా ఉంది. ఆపరేషన్ అనే ఆలోచన వల్ల వచ్చింది. పర్వాలేదు" అన్నారు డాక్టరుగారు.
ఉదయం అయిదు గంటలకు వచ్చినవాళ్లం తొమ్మిది గంటలకి గానీ ఆపరేషన్ రూములోకి తీసుకొని వెళ్లలేదు. థియేటర్‌లోనికి వెళ్లిన వెంటనే తలుపులు మూసివేశారు.
తాతయ్య ఆలోచనలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి
చిన్నప్పటి నుండి నాన్న దగ్గర కన్నా తాతయ్య దగ్గరే ఎక్కువ చేరిక నాకు. నాకూ, అక్కకి కూడా నాన్నకు తరచుగా బదిలీలు కావడం మూలనా, మా చదువులు సక్రమంగా సాగకపోవడం మూలనా మా ఇద్దరం తాతయ్య, నాన్నమ్మల దగ్గరే ఉండిపోవలసి వచ్చింది. అమ్మా, నాన్నలు అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు. కావలసిన డబ్బులు ఇచ్చి వెళుతుంటారు.
తాతయ్య ప్రభుత్వ సంస్ధలో పనిచేసి, రిటైర్ అయ్యారు. ప్రతి నెలా పెన్షన్ వచ్చేది. ప్రతి నెలా పెన్షన్ డబ్బులకు ట్రెజరీ ఆఫీసుకు వెళ్లేవాడు. అప్పుడు నాకు చిన్నతనం. వెంట నేనూ వెళ్ళేవాదిని. ఉదయం పది గంటలకు వెళితే, ఒక్కోసారి సాయంత్రం అయిపోయేది. మా ఊరి చివరలో ఉండేది ఆఫీసు.
పాతకాలం నాటి పెంకుటిల్లు, చుట్టు ప్రక్కల ప్రహరి ఉండేది. ఆఫీసు ముందు అంతా పెద్ద పెద్ద చెట్లు. ఎండాకాలం అయితే అక్కడంతా చల్లగా ఉండేది. పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధులంతా ఆ చెట్ల కింద కట్టిన రాతి చప్టా మీదనే కూర్చుండేవాళ్లు. షోడా బండివాళ్లు, షర్బత్ బండివాళ్లూ, చిన్న, చిన్న తినుబండారాల వాళ్లంతా అక్కడే ఉండేవాళ్లు.
అక్కడే సాయంత్రం వరకూ తాతయ్యతోపాటు ఉండడం నాకు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ప్రతీనెల పెన్షన్ అందుకున్న వెంటనే నాకు అయిదు రూపాయలు ఇచ్చేవాడు. అయిదు  రూపాయలంటే ఈ రోజుల్లో పెద్ద అనిపించదు గానీ, నా చిన్నప్పటిరోజుల్లో అయితే అది చాలా ఎక్కువే. నెలంతా ఆ అయిదు రూపాయల కోసం ఎదురుచూసేవాడిని.
ఆ తరువాత రోజులో తాతయ్యకు పెన్షన్ పెరిగినా నాకు మాత్రం అయిదు రూపాయలు ఇచ్చేవాడు. నేను ఎక్కువ ఇవ్వమని మారాం చేసేవాడిని. అయినా ఇచ్చేవాడు కాదు. పిల్లలకు అంతకంటే ఎక్కువ ఇస్తే, ఖర్చులకు అలవాటు పడిపోతారని అనేవాడు. మా ఇంట్లో అందరికన్నా నేనంటే ఎక్కువ ఇష్టం తాతయ్యకు.
ఆ తరువాత రోజుల్లో పెన్షన్‌కి ఒక్కడే వెళ్ళేవాడు. నా చదువు పాడయిపోతుందని, తనే వెళ్లి వచ్చేవాడు. ఎప్పుడైనా సెకండ్ షోకి వెళితే, నాకోసం కాసుకూర్చునేవాడు. ఎంత రాత్రయినా, నేను ఇంటికి వచ్చేవరకు పడుకునేవాడు కాదు ఎంత తెలివి మీద ఉండేవాడో కానీ, తలుపు కొట్టిన వెంటనే తీసేవాడు. అసలు పడుకునే లేదనే అనుమానం. ఒక్కోసారి వీధిలో కూర్చునేవాడు.
చాలా క్రమశిక్షణ గల మనిషి. ఒక్కసారి కూడా ఇతరుల పైన అసూయ పడడం గానీ, ద్వేషం గానీ ఏనాడూ చూడలేదు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే వాడు. అలాంటిది ఈ కడుపులో నొప్పి ఏమితో అర్ధం కావడం లేదు నాకు.
"తాతయ్యకెలా ఉంది" కావ్యక్క మాటలతో ఒక్కసారిగా తాతయ్య జ్ఞాపకాలనుండి వర్తమానం లోనికి వచ్చాను. "బాగానే ఉందండి. కాకపోతే బయటకు తీసుకురావడానికి టైం పడుతుంది. కంగారు పడాల్సిందేమీ లేదు" అంది నర్సు. అన్నట్టుగానే ఇద్దరు హాస్పిటల్ బాయ్స్ స్ట్రెచర్ మీద నుండి తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. ఇంకా మత్తులోనే ఉన్నాడు ఉలుకూ, పలుకూ లేదు. శ్వాస నెమ్మదిగా వస్తుంది.
నేనూ, అక్కా, పిన్ని, బాబాయ్ అందరం దగ్గరగా వెళ్లాం. మేం తన దగ్గరే ఉన్నట్టు తెలియదు. అక్క "తాతయ్య!" అని పిలువబోయింది. ఊహూ, పలకరించవద్దు అన్నట్టు చేత్తో నర్స్ సైగ చేసింది. మరి ఎవ్వరం మాట్లాడలేదు. అందరం బెడ్ చుట్టూనే ఉన్నాం. అయినా మాలో మేం కూడా మాట్లాడుకోలేదు. ఇంతలో డాక్టరుగారు ఆపరేషన్ రూములోనుండీ బయటకు వచ్చారు. వెళ్ళి డాక్టరుగారిని అడిగాను. "ఎలా ఉంది?" అని . " ఏం పరవాలేదు. బాగానే ఉంది. మాట్లాడించకండి." అన్నారు. డాక్టరుగారితో మాట్లాడి నేను రూములోనికి వచ్చాను. కొద్దిగా కదులుతున్నాడు. దగ్గరికే వెళ్లి కూర్చున్నాను. కడుపు భాగం అంతా కట్టుకట్టి ఉంది. ఇంకా తెలివి రాలేదు.
ప్రక్కనే కూర్చున్నాను. రెండు కాళ్లు అసహనంగా కదుపుతున్నాడు. మాటిమాటికి కాళ్ళను సాగదీస్తున్నట్లు చూపుతున్నాడు. మడమలను బెడ్ వైపు నొక్కి పెట్టి పాదాలను ముందుకు చాపుతున్నాడు.కొంచెం కొంచెం మత్తు వదిలినట్లు ఉంది. అందుకే కొంత కదలిక, లోపల ఎంత బాధ ఉందో ప్రక్కన ఉండి మేం ఏం చెయ్యగలం. బాధని కాస్త పంచుకోగలమా? అలాంటి ఏర్పాటు ప్రకృతిలో ఉంటుందా? ఉంటే ఎంత బాగుంటుంది. లోకంలో బాధలు పడేవాళ్లే ఉండరు. అత్యంత ఆప్తులు, బాగా కావలసిన వాళ్లు, స్నేహితులూ, వాళ్లూ, వీళ్లు అనేమిటి మనసున్న ప్రతీవాళ్లు తలా కొంత బాధలు పంచుకుంటూంటే ఇంకేం కావాలి?
కొంచెం తెలివి వస్తున్నట్లుగా ఉంది. రెండు కాళ్లు సాగదీస్తున్నాడు. కాళ్లు, వేళ్లు కూడా. చెయ్యి కూడా కదిలిస్తున్నాడు. నేను చూస్తూనే ఉన్నాను. చెయ్యిలో చిన్న వణుకు, ఏదో భద్రత కోసం తపిస్తున్నట్లుగా ఉంది. చెయ్యి పట్టుకున్నాడు. ఆ పట్టులో శక్తినంతా కూడదీసుకున్నట్లుగా ఉంది. అగాధంలో పడిపోతున్న మనిషి చెయ్యి పట్టుకున్నట్లుగా ఉంది. నేనేం చెయ్యాలి. తాతయ్య రక్తం నాలోనూ ప్రవహిస్తూనే ఉంది. ఆ ప్రవాహ వేగాన్ని నిత్యం అనుభవిస్తూనే ఉన్నాం. తాతయ్య రెండు కాళ్లు మళ్లీ సాగదీస్తున్నాడు. నేను చూస్తూనే ఉన్నాను.
తాతయ్య రక్తం నాన్నలోనూ,నాన్న ద్వారా నాలోనూ, నా ద్వారా నా పిల్లలలోనూ ఇలా తరతరాలుగా నిరంతరం ప్రవహించే జీవన నదిలాగా, అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ వ్యక్తులంతా భౌతికంగా వేరు వేరు. జీవన గమనంలో ఎవరి పరుగు, నడకా వారివే. బాధల్ని, సుఖాన్ని అనుభవించడంలో ఎవరికి వారు వేరు మార్గాల్లో ప్రయాణిస్తూనే ఉంటారు. మాటల్లో, నడకలో, కనుముక్కు తీరులో, భౌతికమైన ఆకృతిలో కలవనూ వచ్చు. కలవక పోవచ్చు. అయినప్పటికీ అంతర్గతంగా ఉండే 'జీన్స్' మాత్రం లోలోపల వెన్నంటే ఉంటాయి.
చిన్నగా తలుపు చప్పుడైతే తలెత్తి చూశాను. యశోదమ్మ. మేం అందరం ఆప్యాయంగా వదినా అని పిలుస్తుంటాం. మా పక్కింటామె వదిన్ని చూసిన వెంటనే నేను లేచి నిలబడ్డాను.
మా ఇంట్లో ఏ చిన్న కార్యం జరిగినా ఆమె ఉండాల్సిందే. చాలా చొరవగా ఇంట్లో కలిసిపోతుంది. నిజానికి వాళ్లకూ, మాకు ఏ విధమైన బంధుత్వం లేదు. అసలు కులం కానే కాదు. అయినా మనుషులు దగ్గర కావడానికి బంధుత్వాలు ఉండాలా?
వదిన వచ్చిన తాతయ్య ప్రక్కనే చిన్న జాగాలో కూర్చుంది. కానీ నాలాగా చూస్తూ కూర్చోలేదు. రెండు కాళ్లు వత్తసాగింది. కాలివేళ్లు గట్టిగా పిడికిలితో నొక్కి పెట్టింది. ఆ స్పర్శలో మేం అందరం అక్కడే ఉన్నాం అనే సంకేతం మెదడుకు చేరి ఉంటుంది. తాతయ్యకు చాలా హాయిగా ఉన్నట్లుంది. "హమ్మయ్య" అని అనలేదు కానీ అన్నట్లుగానే ముఖంలో హాయిని అనుభవిస్తున్నాను. గొప్ప రిలీఫ్ పొందినట్లుగా అనిపించింది. నాకు ఎవరో చెంప మీద చెళ్లున కొట్టినట్టుగా అనిపించింది. ఇంతసేపు మేం ప్రక్కన ఉండి చేసినదేమిటి? తాతయ్య బాధను చూడడమే కదా!
తాతయ్య బాధ పడుతున్నాడనీ, మేం కూడా బాధపడ్డాం. అంతే కాని బాధోపశమననానికి ఏం చెయ్యాలో ఆలోచించలేదు. కాళ్లు అసహనంగా కదుపుతున్నాడని గమనించి కూడా ఊరుకోవడం ఏమిటి?
ఇప్పుడు వస్తే మాత్రం ఏమిటి? వదిన చెయ్యవలసిన  పని చేసింది. ఆ బాధకు వెంటనే స్పందించింది. ఊరికేనే బాధలపట్ల సానుభూతి చూపించడం వలన వీసమెత్తు ప్రయోజనం లేదు. ఇందరం ఉన్నాం ఎందుకు? పనిచేసే మనిషి ఒక్కడు చాలు. అసలు కావల్సింది అదే. చేసే పనే ముఖ్యం..

                                     **************************