20, ఏప్రిల్ 2018, శుక్రవారం

                         కొన్ని జ్నాపకాలంతే
       
నిజం చెప్పొద్దూ!
కొన్ని జ్నాపకాలంతే!

వాటిని నెమరేసుకున్నపుడల్లా
అమ్మచేతి  కమ్మని కాఫీ నయిపోతాను
మామిడి  తోపుల్లో తిరుగాడే
బాల్యాన్నయిపోతాను

కాసేపు -
ఆ జ్నాపకాల జడివానలో
తడిసా. ..........క

పొరలు పొరలుగా విచ్చుకున్న
మట్టి పెళ్ళనై  పులకించిపోతుంటాను
చెలమనీటి ఊటనై ఊరుతుంటాను

స్మృతులన్నీ మననం చేసుకున్నాక
గుమ్మాన వేళ్ళాడే  మామిడి తోరణమై
మురిసిపోతుంటాను
కోయిలపాటల కమ్మదనమై
పరవశించిపోతుంటాను

కొత్త  చిగురులతో
కొమ్మకొమ్మనీ పలుకరించే
వసంతమై
ఏకంగా    పచ్చదనం పూసుకుంటాను
అమ్మమ్మ ఊరునై
మళ్ళీ..........మళ్ళీ. ......
ఊసుల్ని తడుముకుంటాను

                          చెళ్ళపిళ్ళ శ్యామల

17, ఏప్రిల్ 2018, మంగళవారం

అమ్మా ! గుడిలో దేవుడుంటాడమ్మా !

అమ్మా ఆ బూచోళ్ళంతా
ఏదో చేస్తున్నారమ్మా
నరకం చూస్తున్నానమ్మా
ఒళ్ళంతా ఏసిడ్ తో కడిగినంత
 బాధగా ఉందమ్మా
 నేనేంచేయగలను
అరుద్దామన్న
అరుపు గొంతుదాటి
 రావడంలేదు
 నేను కనిపించకపోయిన
దగ్గర నుండీ నాన్నా మీరంతా
 వేడుకుతుంటారని తెలుసు
మీ పక్కనే గుడిలోనే
 వున్నానని ఎలా చెప్పను
 గుడిలోనపూజారి కూడా
 తలుపులు తెరవడం లేదు
 అమ్మ గుడిలో దేవుడుంటాడా
 అమ్మా ?
నేను ఎంత ఏడుస్తున్నా
ఆ దేవుడు కూడా రావడం లేదమ్మా !
అమ్మా! చచ్చిపోతానేమోనని
 భయంగా ఉందమ్మా
అమ్మా చచ్చిపోవడం అంటే
 ఏంటమ్మా?
అమ్మా చనిపోతే దేవుడి
 దగ్గరకు పోతామని
 చిన్నప్పుడు నాన్నమ్మ చెప్పేది
 అమ్మ చనిపోతే నేను దేవుడి
 దగ్గరకు వెళ్లానమ్మా
అక్కడ దేవుళ్ళు కూడా
ఈ బూచోళ్లలాగే చేస్తారేమో
 నని భయమేస్తోందమ్మా
మరి చనిపోతే మీరెవ్వరూ
 నాకు కనపడరుకదమ్మా!
ఇక నాకు ఓపిక లేదమ్మా
కళ్ళు మూతలు పడుతున్నాయి
అమ్మ నా బొమ్మలు మాత్రం జాగ్రత్తగా ఉంచానమ్మా
ఆ ఆడపిల్ల బొమ్మలో
రోజూ నన్ను చూసుకో అమ్మా!
 అయ్యో ! నన్ను ఎక్కడికో
 ఈడ్చుకొని వెళ్తున్నారు
నా మెడకి తాడు కడుతున్నారు
చెట్టుకి కట్టి
 తాడును లాగేస్తున్నారు
 అమ్మా ఈ క్షణంలో కూడా ఒక్కసారి ఒక్కసారి
 నిన్ను గట్టిగా కావిలించుకొని
 ఏడ్వాలని ఉందమ్మా
 కళ్ళంట కనీసం నీటి చుక్కైనా
 రావడం లేదమ్మా
ఏడ్చి ఏడ్చి అవి యెప్పుడో
 ఇంకిపోయాయి
నా ఒళ్ళుని చూస్తే నాకే
 అసహ్యం వేస్తోందమ్మా
రక్తం ఎండి దెబ్బలతో ఒళ్ళంతా
 పుండైపోయిందమ్మా
నేను చనిపోయిన తర్వాత
 నువ్వు వస్తావని తెలుసు
 ఒక్కసారి నన్ను గట్టిగ
నీ చేతుల్లోనికి తీసుకొని
నా ఏడుపు కూడా
 నువ్వే ఏడుస్తావు కదూ!
 ఒక్కసారి నన్ను గట్టిగా
 పట్టుకోవమ్మా నీ ఒడిలో
 పూర్తిగా నిద్రపోతాను !

 (అభం శుభం తెలియని ఆసిఫా గొంతు నుండి)

రత్నాల బాలకృష్ణ
సెల్ నెం. 9440143488.

15, ఏప్రిల్ 2018, ఆదివారం

నా కవిత పేరు మాతృ భూమి.

పసిపాపల కేరింతల సవ్వడి
శుకపికరావముల కూతల సవ్వడి
కన్నె పిల్లల అందెల సవ్వడి
నా మాతృభూమికి సుప్రభాతం.

పసిడి పంటల పచ్చ దనం
పరిమళాల పూవుల సుగంధం
నీరెండ కాంతుల పచ్చదనం
నా మాతృభూమి కనుల సొగసుదనం.

కవిరాజుల కవితాహారం
మహారాజుల విజయ విహారం
వేదవిదుల విజ్ఞాన భాండారం
నా మాతృభూమికి సుమహారం .

స్వార్థ ప్రజల కుటిల నీతి
అసమర్థ నేతలు అవినీతి
నిస్వార్థ  వృత్తుల  భయభీతి
నా మాతృభూమి హృదయ వేదనాగీతి.

మాతృమూర్తి  మనసు మధురం
మాతృభూమి పలుకు మధురం
మాతృభూమి సేవ మధురం
మరచిన బ్రతుకు వ్యర్థం వ్యర్థం.

అరుదైన వేదాల అలరారు భూమి
అమృతమూర్తుల అపురూపమైన భూమి
అమృత జలాల పావన భూమి
నా మాతృభూమికి అరుదైన అలంకారం.

అన్ని లోకాల మరపించు పుణ్యక్షేత్రాలు
అన్ని మతాల మరపించు తీర్థ క్షేత్రాలు
అన్ని భాషల పలికించే ఏకైక దేశం
అన్ని దేశాలకు ఆదర్శం నా మాతృభూమి

ఇటువంటి నా మాతృభూమికి వందనం అభివందనం.

ఈ కవిత నేను రచించినది. దేనికి అనుకరణ కాదు.
నా ఎస్. కె. నంబరు 2359

నా పేరు డా. దేవులపల్లి పద్మజ
ఊరు విశాఖ